మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేత..
మహాదేవపూర్, ఆంధ్రప్రభ: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది 6.520 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. భారీ వరద ప్రవాహం కారణంగా మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పూర్తిగా ఫ్రీ ఫ్లో పరిస్థితిలో కొనసాగుతోంది.
గురువారం ఉదయం 9 గంటల నాటికి బ్యారేజీ నీటిమట్టం +90.40 మీటర్లుగా నమోదైంది. బ్యారేజీకి 1,01,530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అదే మొత్తంలో 85 గేట్ల ద్వారా 1,01,530 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీ పూర్తిగా ఫ్రీ ఫ్లోలో కొనసాగుతూ వరద జలాలు నేరుగా దిగువకు ప్రవహిస్తున్నాయి.
భారీగా వస్తున్న గోదావరి వరద జలాలను నిల్వ చేసే అవకాశం లేక లక్షకు పైగా క్యూసెక్కుల నీరు నేరుగా సముద్రంలో కలుస్తుండటంపై రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉంటే ఇలాంటి వరద జలాలను నిల్వ చేసి సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి వర్షాకాలంలో గోదావరిలో భారీగా వరద జలాలు ప్రవహిస్తున్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో విలువైన నీరు సముద్రంలో కలుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేసవిలో సాగు, తాగునీటి అవసరాలకు నీటి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో వరద జలాల సమర్థ వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది వద్దకు వెళ్లకుండా, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
