రాగినేడు శ్రీనాగలింగేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దపల్లి రూరల్ (ఆంధ్రప్రభ): మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజున కలిసి వచ్చిన అరుదైన మహాశైవాక్షయోగం సందర్భంగా పెద్దపల్లి మండలం రాగినేడు శ్రీనాగలింగేశ్వరస్వామి దేవాలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ పవిత్ర రోజున స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయనే విశ్వాసంతో తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. “ఓం నమః శివాయ” నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పెద్దపల్లి రూరల్ ఎస్ఐ శ్వేత కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించగా, రాగినేడు గ్రామ సర్పంచ్ సోమ కుమార్ శ్రీనాగలింగేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు.
భక్తుల రద్దీ భారీగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు క్యూలైన్లు, తాగునీటి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. భక్తుల రాకతో రాగినేడు క్షేత్రం శివనామస్మరణలతో మారుమోగి భక్తిభావంతో నిండిపోయింది.
