Kondapochamma Sagar | నీటి విడుద‌లకు నిర‌స‌న‌

కొండపోచమ్మ సాగర్ వద్ద బీఆర్ఎస్ ఆందోళ‌న‌

Kondapochamma Sagar | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేసి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కట్టపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి వెంటనే ఎత్తిపోసి కొండపోచమ్మసాగర్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ పరిధిలోని రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి నీటి విడుదల చేపట్టాలని, లేనిపక్షంలో గజ్వేల్ నియోజకవర్గం బంద్‌కు పిలుపునిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. కొండపోచమ్మసాగర్ ద్వారా సాగునీటి అవసరాలు తీరడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయానికి ప్రయోజనం కలుగుతుందని, ప్రభుత్వం జలాశయాల నిర్వహణపై నిర్లక్ష్యం వహించకూడదని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.