Nalgonda | శిశు, బాలింత మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి – ఆహార కమిషన్ చైర్మన్ గోలి

నల్లగొండ , ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సభ్యులు శారద, భారతి, జ్యోతి సభ్యులతో కూడిన బృందం మంగళవారం నల్లగొండ జిల్లాలో పర్యటించింది. కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలలో పర్యటించిన కమిషన్ చైర్మన్ కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని రేషన్ దుకాణం, ధోనియాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, దేవరకొండ బీసీ బాలుర వసతి గృహాన్ని, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని, కొండ భీమనపల్లి సమీపంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను, ప్రభుత్వ ఆసుపత్రి ని కమిషన్ బృందం సందర్శించింది.

పౌష్టికాహారం అందుతుందా?
ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం అర్హులకు అందుతుందా లేదా అని సభ్యులు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. శిశు, బాలింత మరణాలు లేకుండా జాగ్రత్త వహించాలని, విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందేలా చూడాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల ప్యాకెట్లు పెద్దవిగా ఉండడం వల్ల వృథా ఎక్కువ అవుతుందని తక్కువ మోతాదులో ఉండే పాల ప్యాకెట్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని ప్రభుత్వానికి సూచిస్తామని కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా తీరు ఎలా ఉందని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. రోగుల సౌకర్యార్థం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డీటీడీఓ ఛత్రు నాయక్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *