మెథడిస్ట్ చర్చి ఆస్తులను కాపాడుకుంటాం: క్రిస్టియన్ సంఘ సభ్యులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ చర్చి ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు పోలీసుల సహకారం కూడా తీసుకుంటామని మెథడిస్ట్ క్రిస్టియన్ చర్చి సభ్యులు శ్రీను, సుందరరావు, క్రిస్టఫర్ తెలిపారు.

శనివారం వికారాబాద్లోని మెథడిస్ట్ చర్చి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సేవాభావంతో గతంలో స్థాపించిన పాఠశాల, ఆసుపత్రిని అభివృద్ధి చేయాల్సిన డీఎస్ బిషప్‌లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

చర్చికి చెందిన సుమారు 30 ఎకరాల భూమిని ప్లాట్లుగా విక్రయించేందుకు కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. ఈ ఆస్తులు పేదల సంక్షేమం కోసం ఆంగ్లేయులు అందించినవని, వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

మెథడిస్ట్ చర్చి ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని, అవసరమైతే ఉద్యమం చేపట్టడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జహీరాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు చెందిన క్రిస్టియన్ సంఘ సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవదాస్, ప్రణీత్, డాక్టర్ అవినాష్, సుధాకర్, విద్యాకర్ తదితరులు పాల్గొన్నారు.