పిల్లల మధ్య సరైన ఎడం పాటిద్దాం..

ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో భారీ అవగాహన ర్యాలీ..

ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: ప్రపంచ జనాభా దినోత్సవం–2026 సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం పుట్టపర్తిలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం, సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వహించారు.

జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం”, “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం” అనే సందేశాలను ప్రతి ఇంటికీ చేరేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.

కుటుంబ నియంత్రణ, జననాల మధ్య తగిన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం, బాలికల విద్య, లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రపంచ జనాభా దినోత్సవం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను అర్హులైన దంపతులు వినియోగించుకుని ఆరోగ్యకరమైన కుటుంబ జీవనాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం, ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డీపీఎచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఎన్‌హెచ్‌ఎం) నాగరాజు, వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్‌తో పాటు జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన నినాదాలు చేశారు.