RTC Bus Stand | హుజూర్‌నగర్‌కు కొత్త బస్టాండ్..
మంత్రి పొన్నం శ్రీనివాస్ హామీ
హుజూర్నగర్, కోదాడ బస్టాండ్లకు శంకుస్థాపన..
ఆర్టీసీ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి
మహిళల ఉచిత బస్సు ప్రయాణాలతో రూ.11 వేల కోట్ల ప్రయోజనం..
కొత్త బస్సులు, ఉద్యోగాలపై కీలక ప్రకటనలు
RTC Bus Stand |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హుజూర్నగర్ నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు రూ.11 వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తుండగా, అందులో సుమారు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.
ఆర్టీసీ బలోపేతానికి 2,800 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, మరో 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. కొత్త డిపోలు మంజూరు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్ల ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, హుజూర్నగర్ బస్టాండ్ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం సంస్థను నష్టాల నుంచి గట్టెక్కిస్తూ అనేక డిపోలను లాభాల బాటలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపు, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, రహదారులు అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతానికి బస్సులు నడుపుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా కొత్త మార్గాల్లో అదనపు బస్సులను ప్రవేశపెట్టి ప్రజా రవాణాను మరింత బలోపేతం చేస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా సాగునీటి అంశాన్ని ప్రస్తావించిన మంత్రి, హుజూర్నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూ, నీటిపారుదల శాఖలోని సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని జిల్లాలు పరస్పరం పోటీపడి ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు.
