CM Revanth Reddy | ఎంసీపల్లిలో ఎగిరిన గులాబీ జెండా
CM Revanth Reddy | ఎంసీపల్లిలో ఎగిరిన గులాబీ జెండా
అస్తవ్యస్తమైన అధికారి పార్టీ..
ఎత్తులకు పై ఎత్తులు వేసినా ఫలించని వ్యూహం..
అధికార పార్టీకి చుక్కలు చూపించిన గులాబీ పార్టీ..
చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్..
CM Revanth Reddy | మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గూబ గుయ్ అన్నది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా జరిగిన మున్సిపోల్ ఎన్నికల్లో అధికార పార్టీకి గులాబీ పార్టీ షాక్ ఇచ్చింది. మంత్రులను ఇన్‌ఛార్జిలుగా నియమించి మున్సిపాలిటీల్లో ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. నిత్యం సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థులకు దిశానిర్దేశాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలని తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని స్థానిక నాయకులు బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి పోటాపోటీగా కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రచారాలు చేశారు.
పనిచేయని సంక్షేమ, అభివృద్ధి మంత్రం…
కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని పలు సమావేశాల్లో జిల్లా అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఓటర్లపై ఏ మాత్రం ఆ మంత్రం ఫలించలేదు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల వరం నెరవేర్చడంలో విఫలమవ్వడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. ఆ హామీల ప్రభావం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పై పడింది. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తెచ్చుకున్న వ్యతిరేకత ఏ పార్టీ తెచ్చుకోలేదు. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని అంటున్నారు.
ఎంసీపల్లి చైర్మన్ పీఠం గులాబీ కైవసం..
మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్‌గా తీసుకున్నది. అప్పటి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఓటర్లకు వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలను ఎత్తులకు పై ఎత్తులు వేశారు. బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అభివృద్ధి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు ఓటర్లను ప్రభావితం చేయలేక పోయాయి. మూడు చింతలపల్లిని మాజీ సీఎం కేసీఆర్ నూతన మండలంగా ఏర్పాటు చేసి ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసి మేడ్చల్ జిల్లాలోనే మూడు చింతలపల్లికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి అభివృద్ధి పరిచారని బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓటర్లకు గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని, ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటుతో బుద్ధి చెప్పాలని అభ్యర్థించారు. దీంతో ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. మొత్తం 24 వార్డుల్లో 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
