సోషల్ మీడియా స్టంట్లపై కదిరి పోలీసుల ఉక్కుపాదం

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కదిరి పట్టణంలో వీల్లీ స్టంట్లు, హైస్పీడ్ బైక్ రేసింగ్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై కదిరి టౌన్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు టౌన్ సీఐ డి.వి. నారాయణ రెడ్డి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో నిఘా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువకులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి వద్ద ఉన్న యమహా R15, కేటీఎం డ్యూక్ 390 సహా ఆరు హెవీ మోడిఫైడ్ స్పోర్ట్స్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాదకరంగా వాహనాలు నడిపినందుకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 281 కింద కేసులు నమోదు చేసి బైక్‌లను సీజ్ చేశారు. అలాగే పట్టుబడిన యువకుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీఐ డి.వి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లు చేయడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలూ ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ స్టంట్లు, రేసింగ్ చేసే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసుల చర్యను స్థానికులు స్వాగతిస్తూ, ఇటువంటి చర్యలతో యువతలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.