vedanta-power | 38 శాతం పెరిగిన విద్యుత్ అమ్మకాలు

vedanta-power | హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : వేదాంత పవర్ లిమిటెడ్ జూన్ 30, 2026తో ముగిసిన తొలి త్రైమాసికానికి సంబంధించిన ఉత్పత్తి, అమ్మకాల వివరాలను గురువారం వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ అమ్మకాలు 38 శాతం పెరిగి 5,225 మిలియన్ యూనిట్లకు చేరడంతో కంపెనీకి ఇది అత్యుత్తమ త్రైమాసికంగా నిలిచిందని పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం, మీనాక్షి ప్లాంట్‌లో తొలి త్రైమాసికంలో విద్యుత్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 245 శాతం, గత త్రైమాసికంతో పోలిస్తే 16 శాతం పెరిగి 1,350 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి.

తల్వండి సాబో థర్మల్ ప్లాంట్‌లో ప్లాంట్ లభ్యత సూచీ (పీఎఎఫ్) గత త్రైమాసికంలోని 77 శాతం నుంచి 86 శాతానికి పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో వేదాంత లిమిటెడ్ నుంచి వేదాంత పవర్ లిమిటెడ్ వేరు కావడంతో ఈ త్రైమాసిక గణాంకాల్లో విభజనకు ముందు, తర్వాత కాలాల ఫలితాలు రెండూ ఉన్నాయని కంపెనీ తెలిపింది. అందువల్ల గత కాలాలతో పోలికలను అదే కోణంలో పరిశీలించాలని సూచించింది.

ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో మీనాక్షి ప్లాంట్‌లో 300 మెగావాట్ల ఒకే యూనిట్ కార్యకలాపాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం పూర్తి 1,000 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి రావడంతో తాజా పనితీరు విస్తరించిన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. శక్తి థర్మల్ ప్లాంట్‌లో యూనిట్-1 బాయిలర్‌లో ఏప్రిల్ 14న జరిగిన ప్రమాదం కారణంగా ప్లాంట్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని, దీంతో ఆ ప్లాంట్‌లో విద్యుత్ అమ్మకాలు తగ్గాయని వివరించింది.

పంజాబ్ ప్రభుత్వంతో తల్వండి సాబో థర్మల్ ప్లాంట్ కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం 80 శాతం ప్రామాణిక ప్లాంట్ లభ్యత ఆధారంగా నష్టపరిహారం వర్తిస్తుందని, అయితే తొలి త్రైమాసికంలో ప్లాంట్ లభ్యత 86 శాతంగా నమోదైందని కంపెనీ వెల్లడించింది.