ఎల్‌నీనో ఎఫెక్ట్.. రైతులకు ఉత్తమ్ కీలక సూచనలు

  • ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
  • ఐఎండీ సూచనల మేరకే సాగు నిర్ణయాలు
  • జిల్లాల వారీ కార్యాచరణకు ఆదేశాలు
  • నీటి లభ్యతకు అనుగుణంగా సాగు ప్రణాళికలు
  • రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసే వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలని, వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకే ముందుకు సాగాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎల్‌నీనో పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఈఎన్‌సీ రమేష్ బాబు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హాజరయ్యారు.

అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి జిల్లా వారీ కార్యాచరణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం సమీక్షించి, వాటి ఆధారంగా సాగు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, గ్రామసభలు, రైతు వేదికల ద్వారా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

వాతావరణ, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేసి శాస్త్రీయ సమాచారాన్ని వేగంగా రైతులకు చేరవేయాలని మంత్రి సూచించారు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో శాస్త్రవేత్తల సిఫారసుల ఆధారంగా రైతులకు స్పష్టమైన సలహాలు అందించాలని, రిజర్వాయర్లలోని నీటి నిల్వలపై పారదర్శక సమాచారం అందించి నీటి లభ్యతకు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా చూడాలని చెప్పారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లి సహా గోదావరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను సమర్థవంతంగా నింపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్‌నీనో సవాళ్లను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.