Rythu Ashirvada Sabha | ఖమ్మంలో నేడు ‘రైతు ఆశీర్వాద సభ’..

రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ శ్రీకారం
జగన్నాథపురంలో భారీ ఏర్పాట్లు..
మూడు లక్షల మంది రైతుల హాజరుపై ప్రభుత్వ అంచనా
చివరి విడత రైతు భరోసా నిధుల విడుదలతో పాటు ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రుల పాల్గొనడం

Rythu Ashirvada Sabha | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం (జూలై 10) నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాలకు వేదికగా మారనున్న ఈ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సభ ద్వారా ప్రభుత్వం ప్రారంభించనుంది.

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురం (మత్కేపల్లి క్రాస్ రోడ్) వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన మిగిలిన చివరి విడత ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయ నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అలాగే అర్హులైన రైతులకు ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌లను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా అందజేయనున్నారు.

ఈ సభకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

సభకు దాదాపు మూడు లక్షల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా సభా ప్రాంగణంలో తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్, రవాణా, పరిశుభ్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో ఈ సభ కీలక ఘట్టంగా నిలవనుండగా, రైతు భరోసా నిధుల విడుదలతో పాటు భూ హక్కులకు సంబంధించిన ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చనుంది.