Revanth Reddy| ఒలింపిక్స్‌కు వేదికగా తెలంగాణను సిద్ధం చేస్తాం
కొత్త క్రీడా విధానంతో యువతకు బంగారు భవిష్యత్: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెబ్ డెస్క్: తెలంగాణను భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు వేదికగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో నిర్వహించిన స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
యువతే దేశానికి నిజమైన సంపద అని పేర్కొన్న సీఎం, క్రీడల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడిందని అన్నారు. ఇందుకు గత ప్రభుత్వాల్లో స్పష్టమైన క్రీడా విధానం లేకపోవడమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు పీటీ ఉష వంటి కొందరు క్రీడాకారులు మాత్రమే దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు.
క్రీడలకు ప్రాధాన్యత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని, అదే దిశగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. దేశానికి పతకాలు సాధించి పేరు తీసుకొచ్చే క్రీడాకారుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని ప్రకటించిన సీఎం, యువత లక్ష్యాన్ని చేరుకోవాలంటే వంద శాతం కష్టపడాలని పిలుపునిచ్చారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే యువతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
