Team India | ఫ్లాట్ పిచ్‌ల్లో ఫైర్.. విదేశాల్లో ఫెయిల్!
Team India | ఫ్లాట్ పిచ్‌ల్లో ఫైర్.. విదేశాల్లో ఫెయిల్!
Team India | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ‘ప్రస్తుతం భారత్‌లో ఒకటి కాదు.. ఏకంగా నాలుగు అంతర్జాతీయ టీ20 జట్లను ఎంపిక చేయొచ్చు. అంతటి ప్రతిభ భారత క్రికెట్‌లో ఉంది.’ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో భారత అభిమానులను గర్వపడేలా చేశాయి. కానీ ఇప్పుడు టీమిండియా ప్రదర్శన చూస్తుంటే.. తన మాటలను ఆయనే వెనక్కి తీసుకుంటారేమో అనిపిస్తోంది. ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న భారత బ్యాటర్లు.. విదేశీ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో పరాజయాలు చవిచూడడం జట్టుపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
పాపం..! శ్రేయస్ అయ్యర్
సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత పరిస్థితి ఆశించినట్లుగా మారలేదు. పైగా వరుసగా రెండు సిరీస్‌లు చేజారాయి. అందులోనూ ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్‌కు పెద్ద షాక్‌గా మారింది. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా శ్రేయస్ కెప్టెన్సీకి ఆరంభమే కష్టంగా మారింది. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు మరోసారి చతికిలపడటంతో విమర్శలు మరింత పెరిగాయి.
ఇంగ్లండ్ సిరీస్‌తో బయటపడిన అసలు బలహీనత
ఐర్లాండ్ సిరీస్‌ను ఒక అనుకోని ఫలితంగా భావించే అవకాశం ఉండేది. కానీ అదే తప్పులు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బౌన్స్, స్వింగ్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై భారత బ్యాటర్లు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. స్వదేశంలో ఫ్లాట్ పిచ్‌లపై పరుగుల వర్షం కురిపించే ఆటగాళ్లు.. విదేశాల్లో మాత్రం అదే ధైర్యాన్ని చూపలేకపోతున్నారు.
ఆర్చర్ విమర్శలు..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇటీవల భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘ఫ్లాట్ పిచ్‌లకు అలవాటుపడిన భారత బ్యాటర్లు రియాలిటీలోకి రావాలి. ఇలాంటి బౌలింగ్ పిచ్‌లపై ఆడటం నేర్చుకోవాలి’ అని ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. టీమిండియా ప్రదర్శన కూడా అతని మాటలకు బలం చేకూరుస్తోంది.
సంజూను పక్కన పెట్టడం సరైన నిర్ణయమేనా?
జట్టు ఎంపికపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. విదేశీ పిచ్‌లపై అనుభవం అవసరమైన సమయంలో సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టడం ఎంతవరకు సరైన నిర్ణయమనే చర్చ జరుగుతోంది.
మారాల్సింది టెక్నిక్ మాత్రమే కాదు.. దృక్పథం కూడా
టీమిండియా సమస్య కేవలం షార్ట్ పిచ్ బంతులే కాదు. కొత్త బంతితో స్వింగ్‌ను ఎదుర్కోవడం, సీమ్ కండిషన్లలో ఓపికగా ఆడటం, పరిస్థితులకు తగ్గట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించడం, పవర్‌ప్లేలో వికెట్లు కాపాడుకోవడం, మధ్య ఓవర్లలో స్ట్రైక్ రొటేషన్ చేయడం వంటి అంశాల్లో కూడా జట్టు వెనుకబడుతోంది. ఐపీఎల్‌లో దూకుడే అంతర్జాతీయ క్రికెట్‌లో విజయానికి సరిపోదని మరోసారి స్పష్టమైంది. భారత్‌లో ప్రతిభకు కొదవ లేదు. కానీ ఆ ప్రతిభ విదేశీ పరిస్థితుల్లోనూ ఫలితాలుగా మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే లివింగ్ స్టోన్ చేసిన ప్రశంసలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. ఫ్లాట్ పిచ్‌ల నుంచి బయటకు వచ్చి బౌన్స్, స్వింగ్, సీమ్‌కు అనుగుణంగా తమ ఆటను మార్చుకున్నప్పుడే టీమిండియా మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించగలదు.
