తుంగతుర్తి కాంగ్రెస్‌కు పరిశీలకుడిగా జగ్గారెడ్డి
మోత్కూర్, ఆంధ్రప్రభ: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియోజకవర్గ పరిశీలకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం అనంతరం స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్‌పై అసమ్మతి పెరగడంతో పాటు, పార్టీ అంతర్గత వివాదాలు గాంధీభవన్ దృష్టికి చేరాయి. దీంతో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక సమర్పించాలని జగ్గారెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మరో రెండు, మూడు రోజుల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే మందుల సామెల్‌తో విడివిడిగా సమావేశమై పరిస్థితులపై ఆరా తీసి అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు.
