శరద్ పవార్‌కు ఎన్డీయే గాలం? మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ
శరద్ పవార్‌కు ఎన్డీయే గాలం? మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ
- షిండేతో శరద్ పవార్ భేటీపై ఊహాగానాలు
- కాంగ్రెస్, ఇండియా కూటమిపై మారుతున్న రాజకీయ లెక్కలు
- సుప్రియా సూలే రాజకీయ భవిష్యత్తుపై వ్యూహం
- మహారాష్ట్రలో ఎన్డీయే సమీకరణాలకు కొత్త దారి?
మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఎన్డీయే వైపు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో మరాఠా స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరొందిన శరద్ పవార్ అంశం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. నిన్నటి వరకు ఆయన తనపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే అటు శరద్‌పవార్ ఇటు ఆయన కుమార్తె సుప్రియా సూలే పరోక్ష సంకేతాలిస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షిండేతో శరద్ పవార్ భేటీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామంగా మారింది. ఆయన సైతం ఎన్డీయేలో చేరిపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి శరద్ పవార్ రాజకీయ జీవితం అంతా బీజేపీకి వ్యతిరేకంగా సాగుతూ వచ్చింది. ఆయన బీజేపీతో జతకట్టిన సందర్భాలు లేకపోలేదు. కానీ, ఆనాటి భారతీయ జనసంఘ్ నాయకులైన వాజ్‌పేయి, అద్వానీలతో ఆయన సాన్నిహిత్యం వేరు, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో దోస్తీ వేరు. ఇటీవల కూడా మోడీ విధానాలను పలు సందర్భాల్లో విమర్శించారు.
శరద్ పవార్ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌తో సన్నిహితంగానే కొనసాగుతూ వచ్చింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జాతీయతను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని నెలకొల్పినా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలోనే కొనసాగుతూ వస్తున్నారు.
అయితే, ఈ మధ్య తన అన్నకుమారుడు అజిత్ పవార్ మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో గ్యాప్ వచ్చింది. అలాగే, అటు బీజేపీకి కూడా సమన్వయకర్త అనదగిన నాయకులు ఎవరూ లేరు. తన కుమార్తె సుప్రియా సూలేకు రాజకీయ వారసత్వం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. ఇప్పటికీ ఆ ప్రయత్నంలోనే రాజ్యసభకు పంపారు. అయితే, ఆమెకు రాజకీయ చాణక్యం లేదు. తమ పార్టీ ప్రతిపత్తిని కాపాడుకుంటూనే బీజేపీతో లేదా శివసేనతో సంబంధాలు కొనసాగించే రాజకీయ చాతుర్యం ఆమెకు లేదు.
అందువల్ల నేరుగా తానే ఎన్డీయే కూటమికి దగ్గరైతే, రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవచ్చునన్న అభిప్రాయం ఆయనకు కలిగి ఉండవచ్చు. మరో వైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం వల్ల ఆ కూటమిలో కొనసాగి ప్రయోజనం లేదు. ఎన్డీయేకి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు లేవు.
అందువల్ల నేరుగా బీజేపీతో జత కట్టకుండా, ఏకనాథ్ షిండేతో సాన్నిహిత్యంగా ఉండటం వల్ల రాజకీయంగా కొంత ప్రయోజనం ఉంది. ప్రధానమంత్రి మోడీతో వ్యక్తిగతంగా వైరం లేకపోయినా, ఆయనకు సన్నిహితమయ్యేందుకు షిండే వారధిలా పని చేయవచ్చు. ఈ కోణం నుంచి ఆలోచించి పవార్ షిండేను దగ్గరకు పిలిపించి కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నారు.
తన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్న షిండేతో జతకట్టడం తప్పనిసరి అని పవార్ భావించి ఉండవచ్చు. అజిత్ మరణంతో శరద్ పవార్‌కు కుటుంబపరమైన వారసత్వ పోటీ తప్పింది. రాజకీయంగా ఇన్ని విధాల ఆలోచించి ఆయన షిండేతో మంతనాలు జరిపి ఉండవచ్చు.
మరోవంక తమ పార్టీ (ఎన్సీపీని) కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు పార్టీలోని కొందరు చేస్తున్న ప్రయత్నాలకు చక్రం అడ్డు వేసినట్టు అవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. ఏదైనా రాజకీయ చాణక్యంలో తనకు సాటి లేరని పవార్ నిరూపించుకుంటున్నారని చెప్పవచ్చు.
