క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలం
హెచ్ఎం ప్రభాకర్ నాయుడు
శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, చదువుపై నిబద్ధతను అలవర్చుకున్నప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని కదిరి పట్టణ పరిధిలోని కుటాగుళ్ల మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ నాయుడు అన్నారు. గురువారం పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ, పాఠశాల ప్రారంభమైన సమయం నుంచి ముగిసే వరకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలలోనే ఉండాలని సూచించారు. మధ్యలో ఎలాంటి కారణం లేకుండా బయటకు వెళ్లడం సరికాదని, పాఠశాల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో ప్రార్థన, క్రమశిక్షణ, సమయపాలన కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ప్రార్థనలో పాల్గొనడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, మంచి ఆలోచనలు అలవడతాయని పేర్కొన్నారు. అలాగే పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి యూనిఫాం, షూస్‌ను తప్పనిసరిగా ధరించి రావాలని సూచించారు. ఇది విద్యార్థుల్లో సమానత్వ భావనతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తుందని చెప్పారు.
ఉపాధ్యాయులు ఇచ్చే హోంవర్క్‌ను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ పూర్తి చేసి రావాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదిలో శ్రద్ధగా పాఠాలు విని, ఇంటి వద్ద పునశ్చరణ చేస్తేనే మంచి ఫలితాలు సాధించగలరని వివరించారు.
విద్య అనేది మార్కుల కోసం మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనమని, క్రమశిక్షణతో చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుల సేవలను అభినందిస్తూ గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన తీసుకుంటున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గ్రామస్థులంతా సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ , చంద్రశేఖర్, గొర్ల వెంకటరాముడు,నాగభూషణ్, గంగన్న, పొట్టిండ్ల నరసింహులు, కేవీ నరసింహారెడ్డి, సుబ్బరాయుడు, టైలర్ బాషా తదితరులు పాల్గొని హెచ్ఎం ప్రభాకర్ నాయుడికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసింది. పాఠశాల అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల, తల్లిదండ్రులు, గ్రామ సమాజం కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణ, బాధ్యత, విద్య పట్ల అంకితభావం వంటి విలువలను గుర్తు చేస్తూ సందేశాత్మకంగా సాగింది. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా విద్యాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
