రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని వెంటనే నియమించాలి

బిక్కనూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌కు తక్షణమే పాలకవర్గాన్ని నియమించాలని రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16 కార్పొరేషన్లలో రెడ్డి కార్పొరేషన్‌ను చేర్చడం స్వాగతించదగ్గ నిర్ణయమని అన్నారు. అయితే ఇప్పటి వరకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

కార్పొరేషన్ ద్వారా పేద రెడ్డి కులస్తులకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని, విద్య కోసం అవసరమైన రుణాలను కూడా కార్పొరేషన్ ద్వారా అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయని, వారికి ప్రభుత్వ సహాయం అందేలా పాలకవర్గాన్ని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెడ్డి సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రారెడ్డి తెలిపారు. రెడ్డి కులస్తులంతా ఐక్యంగా ఉండి సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన నాగర్తి రెడ్డి సంఘం సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో భూమి రెడ్డి, రమేష్ రెడ్డి, పోతిరెడ్డి, మల్లేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, నర్సారెడ్డి, లక్ష్మారెడ్డి, భూపతిరెడ్డి, రాజిరెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.