Telangana news | మూడో ప్లాట్‌ఫాంపై విషాద ఘటన..

Telangana news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ నవజాత మగ పసికందును రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌ఫాం సమీపంలోని డ్రైనేజీ కాలువలో వదిలేసి వెళ్లిపోయింది.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు శిశువును వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు ప్రాథమిక చికిత్స అందించగా, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పసికందును అక్కడ వదిలేసి వెళ్లిన మహిళను గుర్తించే పనిలో ఉన్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నవజాత శిశువును ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.