జలకళ తప్పిన చెరువు .. దాసరాపల్లెలో కరువు !
నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
నియంత్రణ లోపమే శాపం
అడుగంటిన భూగర్భ జలం
మరమ్మత్తులు చేయాలి
పూర్వ వైభవం తేవాలి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఒకప్పుడు ఆ గ్రామం సస్యశ్యామలంగా వెలిగేది. జామ తోటలతో కళకళలాడేది. వరి, చెరకు పంటలతో రైతుల ఇళ్లు సిరిసంపదలతో నిండిపోయేవి. కేవలం 30–40 అడుగుల లోతు ఉన్న బావుల్లో సమృద్ధిగా నీరు లభించేది. ఊరి ముందున్న చెరువు, వెనుకనున్న కుంట, గోవిందుని కొండ అడుగున ఎప్పుడూ జలధారలా పారే చెలముతో దాసరా పల్లె ప్రకృతి వరంగా నిలిచింది. గతంలో వరుసగా ఏడేళ్ల కరువు వచ్చినప్పటికీ, ఆ చెలములో చేతికి అందే లోతులో నీరు ఉండేదని గ్రామ పెద్దలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే దాసరా పల్లెలో చెరువు ఎండిపోతోంది. కుంటలో నీటి జాడ లేదు. ఒకప్పుడు కొన్ని అడుగులకే దొరికిన భూగర్భ జలం, నేడు 500 నుంచి 1000 అడుగుల లోతులో బోర్లు వేసినా దొరకని పరిస్థితి ఏర్పడింది.
చిత్తూరు జిల్లా, పెనుమూరు పంచాయతీ, దాసరా పల్లె చెరువు దుస్తిలో ఉంది. ప్రకృతి మార్పులు, నీటి వనరుల నిర్లక్ష్యం, భూగర్భ జలాల క్షీణతకు సజీవ సాక్ష్యంగా మారింది. చార్వాకాని పల్లి గ్రామ సర్వే నంబర్–8లో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల వల్ల చెరువు గట్టు పూర్తిగా బలహీనపడింది. ఫలితంగా చెరువులో నిల్వ కావాల్సిన నీరు వ్యవసాయ భూముల్లోకి ఊరిపోతూ జామ తోటలు, ఇతర పంటలను దెబ్బతీస్తోంది. దీనివల్ల పలువురు పేద రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ చెరువును 1916లో ఇనాముదారుడు ఎన్. పెద్ద ఇరగమరెడ్డి నిర్మించారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రభుత్వానికి అప్పగించగా, 1960లో చార్వాకాని పల్లె సర్పంచ్ ఎన్. బాలిరెడ్డి రివెట్‌మెంట్ నిర్మించి అభివృద్ధి చేశారు. ఈ చెరువు కింద సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు నిండితే బావులు, బోరుబావుల ద్వారా మరో 100 ఎకరాల మెట్ట భూముల్లో కూడా సాగు సాధ్యమవుతుంది. గోవిందుని కొండ వెనుక వైపు, పెనుమూరు సుబ్రమణ్యస్వామి కొండ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటి కాలువలు ఒకప్పుడు ఈ చెరువును నింపేవి. ప్రతి ఏడాది చెరువు నిండి మొరవ పోయేది. దిగువన ఉన్న ఈతమాకుల చెరువు, తాటిమాకులపల్లి చెరువు, గుంటిపల్లి చెరువు, పులికంటి పల్లె చెరువులు కూడా నిండేవి. వందల ఎకరాల సాగుభూములకు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు కలిగేది. గ్రామం వెనుక ఉన్న ఐదు ఎకరాల మల్లిరెడ్డి కుంట కూడా ఉపయోగ కారంగా ఉండేది. కొండకింద ఉన్న బుద్ధారెడ్డి చలంను అభివృద్ధి చేశారు.
అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువుకు నీరు వచ్చే సప్లై కాలువలు పూర్తిగా పూడిపోయాయి. చెరువు సరైన స్థాయిలో నిండడం లేదు. గతంలో 40–50 అడుగుల బావుల నీటితో వరి, చెరకు పంటలు పండించిన రైతులు, నీటి కొరతతో వరి పొలాల్లో కూడా జామ తోటలు వేసే పరిస్థితికి చేరుకున్నారు. ఇటీవలి కాలంలో చెరువులో జరిగిన అక్రమ తవ్వకాలతో బంకమట్టి తగ్గిపోయి గుళ్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల చెరువు కట్ట దెబ్బతింది. ఇప్పుడు కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు నిల్వ కాకుండా పక్కనే ఉన్న పొలాల్లోకి జారిపోతోంది. దీనివల్ల జామ తోటలు, ఇతర పంటలు మరింత నష్టపోతున్నాయి. ఈ చెరువులోని బోరుబావి ద్వారా పెనుమూరు మండల కేంద్రానికి తాగునీటి సరఫరా జరుగుతోంది. అల్లాల చెరువు వద్ద ఉన్న బోరు బావి 6000 జనాభా దాహం తీర్చడానికి చాలక పోవడంతో దాసరా పల్లె చెరువులో బోరు అవసరం అయ్యింది. చెరువులో తగినంత నీరు నిల్వ ఉంటే భూగర్భ జలమట్టం పెరిగి మండల కేంద్రానికి దీర్ఘకాలిక తాగునీటి భద్రత కూడా లభిస్తుంది. కానీ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో వచ్చిన నీరు కూడా నిలవడం లేదు. గతంలో చార్వాకాని పల్లె పంచాయతీలో ఉన్న చెరువు పంచాయతీల విలీనం తర్వాత పెనుమూరు పంచాయతీలో చేరింది.
1947లో వచ్చిన తీవ్రమైన కరువులో కూడా గోవిందుని కొండ క్రింద ఉన్న బుడ్డారెడ్డి చెలములో చేతికి అందే లోతులో నీరు ఉండేదని పెద్దలు చెబుతున్నారు. కానీ నేడు అదే గ్రామంలో 500 నుంచి 1000 అడుగుల బోర్లు వేస్తే తప్ప నీరు లభించని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గ్రామస్తుడు, టిడిపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్. బి. సుధాకర్ రెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపిడిఓ నీలకంటేశ్వర రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
అందులో చెరువు గట్టు లీకేజీలను అరికట్టేందుకు కాంక్రీట్ గోడ నిర్మించాని కోరారు. చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను పూర్తిగా నిరోధించాలని డిమాండ్ చేశారు. వర్షపు నీరు వచ్చే సప్లై కాలువలను పునర్నిర్మించి చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.
ఒకప్పుడు సస్యశ్యామలంగా వెలిగిన దాసరా పల్లె నేడు కరువు గ్రామంగా మారిపోవడం, అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను నిర్లక్ష్యం చేస్తే గ్రామాల భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పే గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
