పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెదక్ పట్టణంలోని 14, 15వ వార్డులలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన సందర్శించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ ఎంతో అత్యవసరమని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో మహమ్మారిని దేశం నుండి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వార్డుల పరిధిలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా విస్మరణకు గురికావద్దని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.