రేపు బీసీల ఆత్మీయ సమావేశం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: బీసీల హక్కుల సాధన కోసం బహుజన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని బీసీ జేఏసీ జిల్లా చైర్‌ పర్సన్ దాసరి ఉష పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని ఆమె నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 29న (సోమవారం) ఉదయం 11 గంటలకు పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ‘బీసీల ఆత్మీయ సమావేశం’ (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆమె తెలిపారు.

దేశ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యత దక్కక చిన్నచూపుకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మన హక్కుల కోసం, రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలు కోసం, విద్యావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగా బీసీలకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాలు లేకపోవడం వల్లనే బహుజనులపై అగ్రవర్ణాల దాడులు, అగాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నాగర్ కర్నూల్, నల్గొండ వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించబోయే ఆత్మీయ సమావేశానికి బీసీ కులాల ప్రతినిధులు, మేధావులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని దాసరి ఉష కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి శంకర్, నాయకులు బిక్షపతి, కె.రమేష్, కలవేణి రవి, ఆసరి రాజయ్య, అబ్దుల్ మాలిక్, శ్రావణ్, అజీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.