ఇంద్రకీలాద్రిపై చిన్నారులకు పోలియో చుక్కలు..
ఆరోగ్యవంతమైన భావితరాలకు దేవస్థానం ముందడుగు
నిత్య ఉచిత వైద్య శిబిరంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్ రాధాకృష్ణ గాంధీ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య ఉచిత వైద్య శిబిరంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ గాంధీ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారికి జీవితాంతం పోలియో వ్యాధి నుంచి రక్షణ కల్పించవచ్చని పేర్కొన్నారు.
ఆలయానికి విచ్చేసిన భక్తుల చిన్నారులకు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైర్మన్ రాధాకృష్ణ గాంధీ పిలుపునిచ్చారు.
దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య ఉచిత వైద్య శిబిరం ద్వారా భక్తులకు ఆరోగ్య సేవలతో పాటు ప్రజారోగ్య కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వైద్య సిబ్బంది, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
