వైభవంగా సూర్యాపాసన సేవ.

ఇంద్రకీలాద్రిపై సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు..
అరుణ, మహాసౌర పారాయణాలతో మార్మోగిన దుర్గగుడి
లోకక్షేమం, భక్తుల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన సేవలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైదిక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. లోకకల్యాణం, భక్తుల ఆయురారోగ్యాలు, సర్వలోక శాంతి కోసం నిర్వహించిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు, పారాయణాలు నిర్వహించి సూర్యనారాయణుడిని ఆరాధించారు.

ఈ సందర్భంగా వేదపండితులు అరుణ పారాయణం, మహాసౌర పారాయణం, సూర్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యారాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, తేజస్సు, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వేదపండితులు వివరించారు. ముఖ్యంగా ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఈ సేవలో పాల్గొనడం విశేష పుణ్యఫలాన్ని అందిస్తుందని తెలిపారు. సూర్యోపాసన అనంతరం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి, ఆదిత్య భగవానుడి ఆశీస్సులు పొందిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం వంటి విశేష దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సూర్యోపాసన వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందస్తుగా మనమిత్ర వాట్సాప్ సేవ లేదా దేవస్థానం టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్లు పొందాలని అధికారులు సూచించారు.