ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వేగవంతం

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వేగవంతం

  • బోగస్ ఓటర్ల తొలగింపే లక్ష్యం : డీఆర్వో మోహన్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ ఓటర్లు, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితాను సిద్ధం చేయవచ్చని పేర్కొన్నారు.

జిల్లాలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) ద్వారా జాబితాలను పరిశీలించవచ్చన్నారు. అలాగే బోగస్ ఓటర్లు, మరణించిన వారి వివరాలు తమ దృష్టికి వస్తే బీఎల్ఓలకు తెలియజేసి ఓటరు జాబితా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. జిల్లాలో సంబంధిత బీఎల్ఓలు 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 15,80,275 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 40,133 దరఖాస్తులు అందాయని తెలిపారు. వీటిలో 217 దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ కాలేదని, 614 దరఖాస్తులు బీఎల్ఓల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఏఈఆర్‌ఓల వద్ద 130, ఈఆర్‌ఓల వద్ద 306 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. 3,891 దరఖాస్తులు తిరస్కరించగా, 34,960 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చినట్లు తెలిపారు.

ఇంకా 1,282 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో కుప్పం ఆర్డీఓ విజయలక్ష్మి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ కార్యదర్శి పరదేశి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వి. సురేంద్ర కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉదయ్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేంద్రతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply