ఆకాశం వైపు రైతన్న చూపు..
ఆకాశం వైపు రైతన్న చూపు..
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఖానాపూర్ మండలంలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఖరీఫ్‌లో ఇదే సమయానికి మొక్కజొన్న, పత్తి, పసుపు పంటల సాగు జోరుగా సాగగా, ఈ ఏడాది మాత్రం వర్షాభావంతో సాగు పనులు నిలిచిపోయాయి. తొలి వర్షాలను నమ్ముకుని కొంత మంది రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. అయితే.. ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
మరోవైపు ఇంకా చాలా మంది రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన మోతాదులో వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంచి వర్షాలు కురిసి సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనాలని రైతన్నలు ఆశాభావంతో ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.
