హిందూ సమ్మేళనంలో పాల్గొన్న వక్తలు..

బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యమని సహా ప్రాంత సద్భావన ప్రముఖ్ గోనె భూమయ్య, సేవికా సమితి కార్యకర్త చందవింధ్య తెలిపారు. ఆదివారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రాంతంలోని శ్రీ వైష్ణవి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వారు పాల్గొని ప్రసంగించారు.

దేశ ప్రగతికి సత్యం, ధర్మం వంటి విలువలను ఆచరించడం అవసరమని, పంచ పరివర్తనల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని వక్తలు పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, ఐక్యత అవసరాన్ని వారు ప్రస్తావించారు. ఈ సందర్భంగా స్థానికంగా హిందూ సమాజానికి చెందిన వ్యాపారులను ప్రోత్సహించాలని సూచనలు చేసినట్లు తెలిపారు. సమాజంలో ఐక్యత పెంపొందించాలని పిలుపునిచ్చారు.

మందమర్రి కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకుడు భావాని స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ సహ కోశాధికారి సూరం లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా, కొండ బాపు అధ్యక్షోపన్యాసం చేశారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ సభలో మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వాసు, దొంగల రాజ్‌కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్, మాజీ కౌన్సిలర్లు కొక్కెర చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు చిదిరాల ఉమాప్రసాద్, మద్దెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply