ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు..

ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు..

పుల్లంపేటలో రూరల్ సర్కిల్ కార్యాలయం ప్రారంభం

పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించడమే లక్ష్యం: ఎస్పీ సుబ్బరాయుడు

పుల్లంపేట, ఆంధ్రప్రభ : ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో పుల్లంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యాలయాన్ని పరిశీలించిన ఎస్పీ, మౌలిక సదుపాయాలు, పరిపాలనా విధానాలు, ప్రజలకు అందించనున్న సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పునర్విభజన అనంతరం రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని రెండు సర్కిల్ కార్యాలయాలు కూడా రైల్వే కోడూరులోనే కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో పుల్లంపేట, పెనగలూరు, ఓబుళవారిపల్లి మండలాలకు చెందిన ప్రజలు పోలీసు సంబంధిత పనుల కోసం రైల్వే కోడూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజల సౌకర్యార్థం పుల్లంపేటలో రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో ఉండడంతో పాటు పుల్లంపేట, పెనగలూరు, ఓబుళవారిపల్లి, చిట్వేల్ పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రజలకు చేరువగా పోలీసు సేవలు

ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావడంతో పాటు ఫిర్యాదుల స్వీకరణ, విచారణ, సమస్యల పరిష్కారం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వేగవంతమవుతుందని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలను అందించడం జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు సత్వర స్పందన, సమర్థవంతమైన పోలీసింగ్, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు.

ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి చట్టపరమైన చర్యలు వేగంగా చేపడతామని, ఎలాంటి సమస్య ఎదురైనా ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, ఏ. శ్రీనివాసరావు, రేణిగుంట సబ్ డివిజన్ అధికారి శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ విక్రమ్, పుల్లంపేట సీఐ శ్రీనివాస్, కోడూరు టౌన్ సీఐ చంద్రశేఖర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.