స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన, ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శ్రీ వారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించారు.

ఈ క్షేత్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్తోత్రాద్రి, భక్తులకు “కదిరి కొండ”గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ కొండల లక్ష్మీనరసింహ స్వామి కాటమరాయుడిగా వెలసి ఉన్నారని, శ్రీ వారు ఈ ప్రాంతంలో పాదం మోపారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే గిరిప్రదక్షిణలో మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

“గోవింద… గోవింద…” నామస్మరణలతో మారుమోగిన స్తోత్రాద్రి ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు భక్తి పారవశ్యంతో గిరిప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.

గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ఆలయ అధికారులు, శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు ప్రసాదం, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన భక్తాదులకు నీలకంఠరెడ్డి కుటుంబ సభ్యులు మహా ప్రసాద వితరణ నిర్వహించారు.

భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి

స్తోత్రాద్రి గిరిప్రదక్షిణకు అనుకూలంగా ఆలయ, ప్రభుత్వ అధికారులు స్పందించి రహదారి సౌకర్యాలు, విశ్రాంతి కోసం బెంచీలు, వాష్‌రూమ్‌లు, ప్రధాన మార్గంలో స్వాగత ఆర్చ్ ఏర్పాటు వంటి సదుపాయాలు కల్పిస్తే మరింత మంది భక్తులు పాల్గొనే అవకాశముందని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వచ్చే నెల నుంచి మహా ప్రసాద వితరణలో ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ల స్థానంలో స్టీల్ ప్లేట్లను వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ప్రసాదం స్వీకరించిన అనంతరం ప్లేట్లను శుభ్రపరిచి యథాస్థానంలో ఉంచి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ గిరిప్రదక్షిణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ శ్రీ వారి ఆశీస్సులు లభించాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు ఆకాంక్షించారు.

Leave a Reply