డీసీసీబీ ఖాతాదారులకు శుభవార్త..

డీసీసీబీ ఖాతాదారులకు శుభవార్త..

యూపీఐ సేవలు అందుబాటులోకి

ఆధునిక, సురక్షిత బ్యాంకింగ్ సేవలే లక్ష్యం: శివాల సూర్యనారాయణ

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఖాతాదారులకు ఆధునిక, సురక్షితమైన, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్-ఇన్-చార్జ్ శివాల సూర్యనారాయణ తెలిపారు. బ్యాంకులో నూతనంగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవల ప్రారంభంతో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా డిజిటల్ చెల్లింపుల యాప్ ద్వారా బ్యాంకు ఖాతాను అనుసంధానించుకుని, తక్షణ నగదు రహిత లావాదేవీలను ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ఈ సదుపాయం ద్వారా ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణ నిధుల బదిలీ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, మొబైల్ నంబర్ ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం వంటి సేవలు 24 గంటలూ సురక్షితంగా అందుబాటులో ఉంటాయని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది.

ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్ వంటి అనుమతి పొందిన డిజిటల్ చెల్లింపుల యాప్‌ల ద్వారా డెబిట్ కార్డు వివరాలతో యూపీఐ పిన్‌ను సెట్ చేసుకుని ఈ సేవలను ప్రారంభించుకోవచ్చని ముఖ్య కార్యనిర్వాహణాధికారి దత్తి సత్యనారాయణ తెలిపారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ ఆర్థిక చేర్పును మరింత బలోపేతం చేయడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. యూపీఐ సేవల వినియోగంతో ఖాతాదారులు వేగవంతమైన, సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని పొందగలరని పేర్కొన్నారు.