సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం..

సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం..
సత్వరమే సమస్యలను పరిష్కరించాలి..
అధికారులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, వరుసగా 2వ రోజు మంగళవారం మండలం కౌకుంట్లలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుండి వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితులు, నాయకులు, ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వారి నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను మంత్రి కేశవ్ ఆదేశించారు.
కార్యక్రమానికి హాజరైన ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. అలాగే, తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ, అందులో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
