ఫేక్ ఆడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం..

ఫేక్ ఆడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం..

  • పోలీసులను ఆశ్రయించిన కాంగ్రెస్ కార్యకర్త

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తన పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ పేరును ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని, దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గీరెడ్డి మహేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు.

ఈ మేరకు కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ), కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు ఫిర్యాదు చేశారు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ వివిధ పదవులు నిర్వహించిన తాను, షబ్బీర్ అలీతో ఎలాంటి ఫోన్ సంభాషణ జరపలేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే జూన్ 12 రాత్రి నుంచి కొందరు వ్యక్తులు తాను షబ్బీర్ అలీ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించినట్లుగా, మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఒక ఆడియోను సృష్టించి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఆడియో ప్రచారం అనంతరం తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు జరుగుతున్నాయని, కొందరు వ్యక్తులు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించడం, పార్టీని చీల్చడం, నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ కుట్ర జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కావున తాను షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా తప్పుడు వాయిస్ ఆడియోను సృష్టించిన వ్యక్తులను, అలాగే ఆ ఆడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నకిలీ ఆడియో ప్రచారం వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగిందని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని పిర్యాదు చేశారు. దీనిపై కామారెడ్డి సీఐ నరహరి విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

Leave a Reply