రైతు నేస్తం 100వ ఎపిసోడ్ విజయవంతం

చేంగల్ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్, సీడ్ మేళా ద్వారా రైతులకు అవగాహన

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న “రైతు నేస్తం” కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా భీమ్‌గల్ మండలంలోని చేంగల్ రైతు వేదికలో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షించి, వ్యవసాయ నిపుణులు అందించిన సూచనలు తెలుసుకున్నారు. అనంతరం రైతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పిస్తూ సీడ్ మేళాను నిర్వహించారు.

వ్యవసాయ శాఖ అధికారులు పంటల ఎంపిక, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలు, విత్తన శుద్ధి, సమగ్ర పురుగు-తెగుళ్ల నివారణ, ఎరువుల సమతుల్య వినియోగం, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై రైతులకు వివరించారు.

నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలనే వినియోగించాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడీఏ బద్దం లావణ్య, ఏఈవోలు డి. స్నేహ, ఎం. దివ్య, హెచ్‌ఈఓ విద్యాసాగర్‌తో పాటు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతులు వ్యవసాయ నిపుణులను పంటల సాగు, విత్తనాల ఎంపిక, తెగుళ్ల నివారణకు సంబంధించిన సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడులను పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు.