ఉదయ్ కేసులో మరో ట్విస్ట్

ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త కోణం
పోలీస్ దర్యాప్తులో బయటపడిన కొత్త ఆధారాలు
నిందితుడి రూంలో ప్రేమలేఖలు
ఉదయ్ కేసులో విచారణ వేగం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపుల ఆరోపణలతో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన పోలీసులు, మరో మహిళతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు, ఆమె దర్యాప్తులో వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణను విస్తరించారు. ఈ క్రమంలో అశోక్‌నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, రెండు ప్రేమలేఖలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా లభించిన ప్రేమలేఖలు, ఇతర ఆధారాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. 2014లో వివాహమైన ఆ మహిళ 2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో ఉంటున్న సమయంలో ఉదయ్‌తో పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం ఆమె ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసి, ఈ ఏడాది జనవరిలో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్‌నగర్‌లోని ఓ సివిల్ సర్వీసెస్ శిక్షణ సంస్థలో చేరినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ సమయంలో లివ్‌-ఇన్‌ రిలేషన్‌లో ఉండాలని ఉదయ్ కోరినప్పటికీ, చట్టపరంగా విడాకులు రాకపోవడంతో ఆమె నిరాకరించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఆ మహిళను కలిసి, తనపై ఉదయ్ కృష్ణారెడ్డి దాడులు, వేధింపులకు పాల్పడుతున్నాడని వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ మహిళ కూడా ఉదయ్‌కు దూరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ కేసును అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తును డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురి వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు, స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలు, ఇతర ఆధారాల ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అంశాలు దర్యాప్తు ప్రక్రియలో భాగంగా బయటపడిన సమాచారం మాత్రమే. వీటిపై పోలీసుల అధికారిక ప్రకటన లేదా కోర్టు నిర్ధారణ రావాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.