జీవితానికి మరో అవకాశం… అవయవదానమే ఆశాకిరణం…

ఆగస్టు 3 జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం సందర్భంగా వైద్యుల పిలుపు
అవయవదానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచన


కర్నూలు రూరల్ బ్యూరో, ఆగస్టు 3 (ఆంధ్రప్రభ): అవయవదానం ద్వారా మరణానంతరం కూడా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ గొప్ప మానవతా సేవపై అవగాహన పెంపొందించుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్డియో థొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ విభాగం ప్రొఫెసర్, హెడ్ డా. చింతా ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 3న (ఇవాళ‌) జాతీయ హృదయ మార్పిడి (నేషనల్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్) దినోత్సవం నిర్వహిస్తున్నారు.

గుండె వైఫల్యం చివరి దశకు చేరుకున్న రోగులకు మందులు, యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ శస్త్రచికిత్సలు కూడా ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అలాంటి సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే ప్రాణాలను కాపాడే మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మెదడు మరణం (బ్రెయిన్ డెత్) చెందిన ఆరోగ్యవంతమైన దాత గుండెను తగిన రోగికి మార్పిడి చేయడం ద్వారా అతనికి కొత్త జీవితాన్ని అందించవచ్చని వివరించారు.

అభివృద్ధి చెందిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యం

భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు గణనీయంగా అభివృద్ధి చెందాయని డా. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్లు, సమర్థవంతమైన అవయవ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో హృదయ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య అవసరానికి తగ్గట్టుగా లేకపోవడంతో అనేక మంది రోగులు సరైన సమయంలో గుండె అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రెయిన్ డెత్ గుర్తింపు కీలకం
అవయవదాన ప్రక్రియలో బ్రెయిన్ డెత్‌ను గుర్తించడం, కుటుంబ సభ్యుల సమ్మతి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఒక అవయవదాత గుండెతో ఒకరికి, కాలేయంతో మరొకరికి, రెండు మూత్రపిండాలతో ఇద్దరికి, కళ్లతో ఇద్దరికి, ఇతర అవయవాలతో మరికొందరికి జీవనాధారాన్ని అందించవచ్చని తెలిపారు. మొత్తంగా ఒక అవయవదాత ఎనిమిది మందికి పైగా కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉందని వివరించారు.

ప్రతి కుటుంబంలో అవయవదానంపై చర్చ జరగాలి

జాతీయ హృదయ మార్పిడి దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అవయవదానం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులతో ముందుగానే ఈ అంశంపై చర్చించాలని డా. చింతా ప్రభాకర రెడ్డి సూచించారు. అవయవదానం అనేది మరణానంతరం కూడా మనిషి చేసే అత్యున్నత మానవతా సేవ అని పేర్కొన్నారు. అవయవదానం చేయండి… మరణానంతరం కూడా పలువురి గుండెల్లో చిరస్థాయిగా జీవించండి. మీ నిర్ణయం అనేక కుటుంబాల్లో ఆశాకిరణంగా మారుతుందన్నారు.