గ్రూప్స్ జాప్యంపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

బాధితుడికి బీఆర్ఎస్ భరోసా
ఆస్పత్రిలో వేణుకుమార్‌ను కలిసిన పువ్వాడ
వేణుకుమార్ ఆరోగ్యంపై ఆరా తీసిన నేతలు

ఖమ్మం, ఆంధ్రప్రభ: గ్రూప్స్ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి. వేణుకుమార్ను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేణుకుమార్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన నాయకులు వేణుకుమార్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. అనంతరం వేణుకుమార్ రాసిన లేఖను పరిశీలించి, ఆయన నాయనమ్మతో పాటు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.

వేణుకుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ నేతలు, ఈ క్లిష్ట సమయంలో పార్టీ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతలో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం గుర్తించి, నియామక ప్రక్రియలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.