పాఠశాల వాహనాలపై ఆర్‌టీఏ ప్రత్యేక తనిఖీలు

పాఠశాల వాహనాలపై ఆర్‌టీఏ ప్రత్యేక తనిఖీలు

నిజామాబాద్, (ఆంధ్రప్రభ): విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పాఠశాల వాహనాలపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జిల్లా రవాణా అధికారి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) దుర్గా ప్రమీల పర్యవేక్షణలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు పలు ప్రాంతాల్లో విద్యాసంస్థల బస్సులు (ఈఐబీలు), ఆటోరిక్షాలను తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో 40కు పైగా విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఆటోరిక్షాలను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన ఐదు వాహనాలపై కేసులు నమోదు చేశారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) అశ్వత్ మూడు కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్న ఒక ఆటోరిక్షాపై కేసు నమోదు చేయగా, బీమా (ఇన్సూరెన్స్) లేని ఒక పాఠశాల బస్సుపై మరో కేసు నమోదు చేశారు. అదేవిధంగా, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ సక్రమంగా పనిచేయని మరో బస్సుపై చర్యలు తీసుకున్నారు.

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) మణికంఠ 60 ఏళ్లకు పైబడిన డ్రైవర్‌తో నడుస్తున్న ఒక పాఠశాల బస్సుపై కేసు నమోదు చేశారు. ఇది టీజీఎంవీవీఆర్ నిబంధనలలోని రూల్ 185(జీ) ఉల్లంఘనగా గుర్తించారు. ఏఎంవీఐ పవన్ కళ్యాణ్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఇన్సూరెన్స్ లేని మరో విద్యాసంస్థ బస్సుపై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా డీటీసీ దుర్గా ప్రమీల మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించే ఆటోలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాల వాహనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన డ్రైవర్లతో పాఠశాల బస్సులు నడపడం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు లేకపోవడం, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ వంటి భద్రతా ప్రమాణాలను విస్మరించడం తీవ్రమైన ఉల్లంఘనలని పేర్కొన్నారు. ఫిట్‌నెస్ లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డీటీసీ దుర్గా ప్రమీల స్పష్టం చేశారు. ఇటువంటి ప్రత్యేక తనిఖీలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.