5000m National Record | పారుల్ చౌదరి నయా రికార్డ్..
5000m National Record | పారుల్ చౌదరి నయా రికార్డ్..
- ఫ్రాన్స్‌లో మెరిసిన భారత అథ్లెట్
- జాతీయ రికార్డు బద్దలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భారత స్టార్.. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన మీటింగ్ నికాయా-2026 అథ్లెటిక్స్ పోటీల్లో మహిళల 5000 మీటర్ల విభాగంలో తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది. 31 ఏళ్ల పారుల్ చౌదరి 15 నిమిషాల 04.26 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది.
అయితే, ఈ ప్రదర్శనతో ఆమె 2023లో నెలకొల్పిన 15:10.35 నిమిషాల జాతీయ రికార్డును ఆరు సెకన్ల తేడాతో బ్రేక్ చేసింది. ఈ రేసులో ఇథియోపియాకు చెందిన బెరెకా సెనియా మహ్మద్ 15:03.85 టైమింగ్‌తో తొలి స్థానాన్ని దక్కించుకుంది. పారుల్ చౌదరి విజేతకు కేవలం 0.41 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలవడం విశేషం.
సూపర్ ఫామ్‌లో పారుల్..
ఇటీవల షాంఘై డైమండ్ లీగ్‌లో జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ పోటీల్లో కూడా పారుల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అక్కడ ఆమె 9:12.84 టైమింగ్ నమోదు చేసి, భారత అథ్లెటిక్స్ చరిత్రలో రెండో అత్యుత్తమ టైమింగ్ సాధించింది. ఆమె జాతీయ రికార్డు 9:12.46గా కొనసాగుతోంది.
షాంఘై డైమండ్ లీగ్‌లో ఒలింపిక్ చాంపియన్ పెరుత్ చెముటాయ్, ప్రపంచ చాంపియన్ ఫెయిత్ చెరోటిచ్ వంటి దిగ్గజ అథ్లెట్లతో పోటీ పడిన పారుల్ ఏడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె ప్రదర్శన చూస్తుంటే రాబోయే అంతర్జాతీయ టోర్నీల్లో భారత పతక ఆశలను మరింత పెంచుతోంది.
