చెన్నై – .చెపాక్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగే బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. . మెగా లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా.. సొంత మైదానంలో ఘన విజయంతో సీజన్‌ను ఆరంభించాలని చెన్నై భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ధోనీ ప్రధాన ఆకర్షణ. మరోవైపు హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ విధించడంతో తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు
సీఎస్కే బలమిదే..
టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు, బౌలర్లే కాకుండా.. ఆల్‌రౌండర్ల పాత్ర అత్యంత కీలకం. ఈ విషయంలో ముంబయితో పోలిస్తే చెన్నై కాస్త బలంగా ఉందనిపిస్తోంది. దాదాపు పదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా సీఎస్కేదే. మరీ ముఖ్యంగా ధోనీ నెట్స్‌లో కొడుతోన్న హెలికాప్టర్ల షాట్లను చూస్తుంటే ‘ఫినిషర్’ మళ్లీ బయటకొచ్చినట్లే అనిపిస్తోంది. మరే ఇతర జట్టుకూ లేనట్లు స్క్వాడ్‌లో 11 మంది ఆల్‌రౌండర్లు ఉండటం గమనార్హం. తుది జట్టులో కనీసం నలుగురైదుగురికి అవకాశం రావడం ఖాయం.
చాలా ఏళ్ల తర్వాత సొంత జట్టుకు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్‌ను పంచుకోనునున్నారు. సామ్ కరన్, శివమ్ దూబె వంటి మీడియం పేస్ ఆల్‌రౌండర్లు జట్టు సొంతం. ఇక నూర్ అహ్మద్ వంటి విభిన్నమైన స్పిన్నరూ అవకాశం కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి. పేస్ విభాగంలో మతీశా పతిరణకు తోడుగా ఖలీల్ అహ్మద్ లేదా అన్షుల్ కంబోజ్ రెండో పేసర్‌కు సేవలందించే అవకాశం ఉంది.
టాప్ -4 అదరగొడితేనే..
ముంబయి జట్టులో నలుగురు అత్యంత డేంజరస్ బ్యాటర్లు. వీరిలో ఏ ఒక్కరు నిలబడినా వేగంగా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్.. బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడేస్తారు. వీరితోపాటు కెప్టెన్ హార్దిక్ పాండ్య విలువైన పరుగులు చేయడంతోపాటు వికెట్లు తీస్తూ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయగలడు.
తొలి మ్యాచ్‌లో ఆడటం లేదు.
గతేడాది పాండ్య స్లో ఓవర్‌రేట్ కారణంగా ఒక మ్యాచ్‌నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో చెన్నైతో మ్యాచ్‌కు సూర్య కుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తాడు. కానీ, సూర్య కుమార్ ఫామ్ కాస్త ఆందోళనకరకంగానే ఉంది. అయినా, అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రమాకరమే. మరో యువ బ్యాటర్ తిలక్ వర్మ మాత్రం ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అదరగొట్టేశాడు.
ఇక ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే జోష్‌తో ఇప్పుడీ ఐపీఎల్‌కు వచ్చేశాడు..
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయమే ముంబయిని కలవరపెడుతోంది. అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి అప్రూవల్ రాలేదు. కనీసం మూడు లేదా నాలుగు మ్యాచ్‌లకు దూరమవుతాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో పేస్ భారం ట్రెంట్ బౌల్ట్, పాండ్య, దీపక్ చాహర్‌పైనే తప్పదు. మిచెల్ శాంట్నర్, ముజీబ్, కర్ణ్ శర్మతో కూడిన స్పిన్ విభాగం బాగానే ఉంది.