Case-Filed : కేశినేని నాని పై కేసు Andhra Prabha Crime News
Case-Filed : కేశినేని నాని పై కేసు Andhra Prabha Crime News
- ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదు
- పటమట పోలీసుల దర్యాప్తు షురూ
- సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణ
- ఉర్సా క్లస్టర్స్ అంశంపై బహిరంగ లేఖ వివాదం
- బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద పలు సెక్షన్లతో కేసు
(విజయవాడ, ఆంధ్రప్రభ)
Case-Filed : మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఫిర్యాదు పై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. పోలీసులకు అందించిన ఫిర్యాదులో, 2025 ఏప్రిల్ 22న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో తాను అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు కేశినేని నాని బహిరంగ లేఖ విడుదల చేశారని చిన్ని పేర్కొన్నారు. అలాగే బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే లీగల్ నోటీసు పంపినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పటమట పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 204, 351, 352, 353, 356, 61 సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని 66, 66(సి), 66(డి), 67, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పటమట పోలీసులు వెల్లడించారు.
