ఆధ్యాత్మిక విలువలు పెంచుదాం…
ఆధ్యాత్మిక విలువలు పెంచుదాం…
ఈఓ శీనా నాయక్
పోరంకి వేద పాఠశాల, గోశాల అభివృద్ధి పనులపై ఈఓ తనిఖీ..
మౌలిక వసతుల మెరుగుదలకు ఆదేశాలు.. సుందరీకరణపై ప్రత్యేక దృష్టి..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, శనివారం పోరంకిలోని దేవస్థానం వేద/స్మార్త పాఠశాల మరియు గోశాలను సందర్శించి అభివృద్ధి పనులు, పరిపాలనా వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలో పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, గోశాల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. వేద పాఠశాలలో విద్యాబోధన, తరగతుల నిర్వహణ తీరుపై ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, సిబ్బందికి మరింత మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల, గోశాల ఆవరణలను పచ్చదనంతో నింపి ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
గోశాల, వేద పాఠశాల పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. పోరంకి వేద పాఠశాలలో ఆధ్యాత్మిక, విద్యా కార్యక్రమాలను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని ఈఓ పేర్కొన్నారు. ఈ తనిఖీ సందర్భంగా దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్, ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి, వేద పాఠశాల అధ్యాపకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొని పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు.
