పుకార్లను నమ్మొద్దు..
పుకార్లను నమ్మొద్దు..
బుడమేరు నీటి విడుదలపై భయాందోళనలు అవసరం లేదు
వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా 100 క్యూసెక్కుల నీటి విడుదల
నియంత్రిత పద్ధతిలోనే ప్రవాహం కొనసాగుతోంది
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)లో లైనింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలిక క్రాస్ బండ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో బుడమేరు ద్వారా వచ్చిన స్వల్ప పరిమాణంలోని వర్షపు నీటిని వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం సుమారు 100 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తిగా నియంత్రిత పద్ధతిలోనే జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
నీటి ప్రవాహం కారణంగా ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటి ప్రవాహం, రెగ్యులేటర్ పరిస్థితులు, కాలువల సామర్థ్యం పై అధికారులు నిరంతరం నిఘా ఉంచారని వెల్లడించారు. ప్రజలు ఎటువంటి పుకార్లను నమ్మకుండా అధికారికంగా జిల్లా పరిపాలన విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు. వాస్తవ పరిస్థితులపై సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
