ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు
- ఏఐసిటీఈ ప్రగతి స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థిని వెన్నెల
- అందనున్న రూ.50 వేల ఆర్థిక సహాయం
కేసముద్రం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మామిడిరేవుపల్లి గ్రామానికి చెందిన జి. వెన్నెల ప్రతిష్ఠాత్మకమైన ఏఐసిటీఈ ప్రగతి స్కాలర్షిప్–2025కు ఎంపికైనట్లు కేసముద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ. మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మైబీ, రాజు దంపతుల కుమార్తె అయిన జి. వెన్నెల ప్రస్తుతం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటీఈ) ఆధ్వర్యంలో బాలికల ఉన్నత సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు అందజేసే ఈ స్కాలర్షిప్కు ఆమె ఎంపికైంది.
ఈ స్కాలర్షిప్ ద్వారా జి. వెన్నెలకు ప్రతి విద్యా సంవత్సరానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందనుంది. ఈ సాయం ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఈ. మల్లికార్జున్ మాట్లాడుతూ, జి. వెన్నెల సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని, ఇతర విద్యార్థినులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఇటువంటి జాతీయ స్థాయి స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కళాశాల నోడల్ అధికారి బి. సత్యనారాయణ మాట్లాడుతూ, ఏఐసిటీఈ అందిస్తున్న వివిధ స్కాలర్షిప్ పథకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా మరింత మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జి. వెన్నెల ఎంపికకు సహకరించిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు.
జి. వెన్నెల ఈ ప్రతిష్ఠాత్మక స్కాలర్షిప్కు ఎంపిక కావడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
