KTR | మాదెప్పుడు ఒంటరి పోరే..

KTR | మాదెప్పుడు ఒంటరి పోరే..

  • కాంగ్రెస్ జారుడు బండపై ఉంది..
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్యే పోటీ: కేటీఆర్
  • హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కేటీఆర్
  • మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదంపై స్పందన
  • సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై కీలక ప్రకటనలు
  • కేసీఆర్ బస్సు యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మీడియా చిట్ చాట్ లో పాల్గొని, తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రీకృత విమర్శలు చేసారు. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, హైదరాబాద్ అభివృద్ధి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై స్పందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం కంటే వెనక్కి నెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వానికి స్పష్టమైన దృష్టి లేదని, ఇప్పటికే ఉన్న నగర సమస్యలను పరిష్కరించకుండా ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో ప్రచారానికే పరిమితమవుతోందని విమర్శించారు.

మీనాక్షి నటరాజన్ వివాదంపై స్పందన…

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అది సరైన పరిణామం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచే సమాచారం వెళ్లిందని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఈ వివాదం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, దీనికి బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులతో వస్తున్నాయనే ఆరోపణలు చేశారు కేటీఆర్.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జారుడు బండపై ప్రయాణిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవుతుందని, తెలంగాణలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని జోస్యం చెప్పారు.

పార్టీ బలోపేతంపై దృష్టి

బీఆర్ఎస్ సంస్థాగత బలోపేతంపై కూడా కేటీఆర్ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ సమావేశాలు పూర్తయ్యాయని తెలిపారు. సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న ప్రత్యేక యాప్ తుది దశలో ఉందని, త్వరలోనే పార్టీ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని సరూర్‌నగర్‌లో భారీ సభ నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

బస్సు యాత్రపై క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ భవిష్యత్‌లో బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉందని, అయితే దాని సమయం, షెడ్యూల్‌పై తుది నిర్ణయం కేసీఆరే తీసుకుంటారని తెలిపారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply