Sri Sathya Sai ఆకస్మిక తనిఖీతో అప్రమత్తమైన అధికారులు..
Sri Sathya Sai ఆకస్మిక తనిఖీతో అప్రమత్తమైన అధికారులు..
నిర్లక్ష్యానికి కఠిన చర్యల హెచ్చరిక!
శ్రీ సత్యసాయి (Sri Sathya Sai), ఆంధ్రప్రభ:
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ శుక్రవారం పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, ప్రజల నుంచి అందుతున్న వినతుల పరిష్కార విధానంపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విధులకు ఆలస్యంగా హాజరయ్యే వారు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో పట్టణ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రధాన రహదారులు, కాలనీలు, ప్రజా ప్రదేశాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, డ్రైనేజీల పూడికతీత పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘స్పందన’తో పాటు ఇతర విభాగాల ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన ప్రజలకు వారి సమస్యల పరిష్కార స్థితిగతులపై స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న సిమెంట్ రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి దీపాల నిర్వహణ వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించి, పన్నుల వసూళ్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరిపాలనా వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
