కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం..
కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం..
దేశంలోనే అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు
2027లో రైతులకు సాగునీరు అందిస్తాం
నవంబర్ లో బ్యారేజ్ పునరుద్ధరణ పనులు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద మానవ తప్పిదంగా నిలిచిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు రూపకల్పన చేసి, ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించి జరుగుతున్న సాంకేతిక పరీక్షలను బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ వ్యయం చూపించి అధిక కమిషన్లు పొందాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం నీరు లేకపోయినా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్ల అంచనాతో చేపట్టి దాదాపు రూ.11 వేల కోట్ల పనులు పూర్తి చేశామని గుర్తుచేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు రూపకల్పనను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని ఆరోపించారు.
16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు తప్పుడు నిర్ణయాలు, లోపభూయిష్ట నిర్మాణం కారణంగా సమస్యల్లో చిక్కుకుందని మంత్రి పేర్కొన్నారు. సుమారు రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాల వల్లే కుంగుదల చోటుచేసుకుందని తెలిపారు.
బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో సమగ్ర పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజకీయ ఉద్దేశాలు ఏమాత్రం లేవని, పూర్తిగా సాంకేతిక ప్రమాణాల ఆధారంగానే పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. మేడిగడ్డ పునరుద్ధరణ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అఫ్రీ సంస్థను డిజైన్ కన్సల్టెంట్గా నియమించి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ బొంబాయి నిపుణులతో కలిసి రీ-డిజైన్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
జూన్ చివరి నాటికి లేదా జూలై తొలి వారంలోగా అన్ని పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని, నివేదికల ఆధారంగా పునరుద్ధరణ డిజైన్ సిద్ధం చేస్తామని తెలిపారు. అనంతరం సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకుని నవంబర్-డిసెంబర్ నెలల్లో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఒకే వర్కింగ్ సీజన్లో పనులు పూర్తి చేసి 2027 నాటికి రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యమని వెల్లడించారు.
పునరుద్ధరణ ప్రక్రియలో భారత సైన్యానికి చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. కల్నల్ పరిషిత్ మెహ్రా ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ, విదేశాల నిపుణుల సూచనలతో ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు , ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ బట్టు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
