కర్నూలును పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం

కర్నూలును పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి : మంత్రి టీజీ భరత్
ఓర్వకల్లుకు భారీ పెట్టుబడులు.. సెమీకండక్టర్ రంగంలో రూ.23 వేల కోట్ల అవకాశాలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. బుధవారం కర్నూలులో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుపుతామని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అరాచకాలు ప్రజలకు స్పష్టంగా తెలుసని మంత్రి విమర్శించారు. అప్పట్లో పనిచేసిన అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారని, మారింది కేవలం నాయకత్వమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిపాలనకు కొత్త దిశ లభించిందని, దూరదృష్టి ఆలోచనలతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం వస్తున్న పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని టీజీ భరత్ వెల్లడించారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన కారణంగానే పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు ఆకర్షితులవుతున్నారని వివరించారు.
కర్నూలు జిల్లాలో వలసలను అరికట్టేందుకు పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. గతంలో ఓర్వకల్లులో జైరాజ్ స్టీల్ కంపెనీకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పటికీ, వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతుల జాప్యంతో సంస్థ ఇబ్బందులు ఎదుర్కొన్నదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయని, జైరాజ్ సంస్థ మరో రూ.6 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోందని తెలిపారు. ఓర్వకల్లుకు ఇప్పటికే అగస్త్య, రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు.
సెమీకండక్టర్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకొస్తే ఓర్వకల్లుకు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లే ఈ అవకాశాలు సాధ్యమయ్యాయని తెలిపారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా అవి భూమిపై అమలయ్యేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీజీ భరత్ ఆరోపించారు. లేనిపోని విషయాలను సృష్టించడం ఆ పార్టీ నైజమని విమర్శించారు. నాయకత్వం ఎలా ఉంటే కింది స్థాయి కార్యకర్తలు కూడా అలాగే ఉంటారని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కేంద్ర ప్రభుత్వంలో గౌరవం పెరిగిందని, ఎన్డీయే ప్రభుత్వం కొనసాగితే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. కర్నూలులో వైసీపీ పరిస్థితి ఆ పార్టీ నేతల ఆడియో లీకుల ద్వారానే బయటపడిందని విమర్శించారు.
సి.క్యాంపు ప్రభుత్వ క్వార్టర్స్ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని మంత్రి తెలిపారు. దీని వల్ల కర్నూలు నగరాభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదులు, ఉద్యోగులు, ప్రజల రాకపోకలతో నగర ఆర్థిక వ్యవస్థ మరింత చురుకుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా బుధవారపేటలో ఏర్పాటు కానున్న ఎంఎస్‌ఎంఈ పార్కు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది కీలక వేదికగా మారనుందని పేర్కొన్నారు.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులు కష్టపడాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని సూచించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల ఆధారంగా ప్రజలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
