కోనేరు పనుల్లో కోట్ల అవినీతి?
కోనేరు పనుల్లో కోట్ల అవినీతి?
లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణకు డిమాండ్
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన కోనేరు (బృగుతీర్థం) మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన నాయకుడు బైరవ ప్రసాద్, బీజేపీ నాయకులు నాగేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు ప్రేమ్‌నాథ్ రెడ్డి, సోమ్లా నాయక్ మాట్లాడుతూ కోనేరు మరమ్మతుల పేరుతో రెండు దశల్లో దాదాపు రూ.6 కోట్ల వరకు బిల్లులు చెల్లించారని, అయితే పనులు మాత్రం నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా జరిగాయని విమర్శించారు.
గత ఆరు నెలల్లో పూర్తికావాల్సిన పనులు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం వెనుక భారీ అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. దేవాదాయ శాఖకు చెందిన కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వ్యవహరిస్తూ ఆలయ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయంలో అదనపు నిర్మాణాల పేరుతో నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి కోట్లాది రూపాయలు కాజేశారని, వరదల సమయంలో చేపట్టని పనులను చేసినట్లు చూపించి తప్పుడు బిల్లుల ద్వారా నిధులు మళ్లించారని ఆరోపించారు.
భక్తులు కానుకల రూపంలో సమర్పిస్తున్న కోట్లాది రూపాయలను ఆలయ అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై వాటిని దోచుకుంటున్నారని విమర్శించారు. ఆరు సంవత్సరాలుగా కోనేరు పనులు పూర్తి కాకపోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఆలయం చుట్టుపక్కల దేవాదాయ శాఖకు చెందిన విలువైన ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండటంతో పాటు ప్రధాన ఆలయంలోకి కూడా వర్షపు నీరు చేరిందని, ఇది నిర్వహణ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని అన్నారు.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆలయ అభివృద్ధి పనులు, ఖర్చులు, టెండర్ల వివరాలపై దాదాపు పది మంది భక్తులు సమాచారం కోరినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. ప్రజలకు, భక్తులకు అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని దాచిపెట్టడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
దేవుడికి సమర్పించే నైవేద్యం, భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాల విషయంలో కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ పరిపాలనలో పారదర్శకత పూర్తిగా కొరవడిందని విమర్శించారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రిని కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
