గృహ కార్మికుల నియామకంలో జాగ్రత్తలు తప్పనిసరి

గృహ కార్మికుల నియామకంలో జాగ్రత్తలు తప్పనిసరి

  • నేపాలీ గృహ కార్మికుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మేడ్చల్ పోలీస్ శాఖ ప్రకటన..

మేడ్చల్, ఆంధ్రప్రభ : ఇళ్లలో పనిమనుషులు, కేర్‌టేకర్లను నియమించుకునే విషయంలో నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇటీవల గృహ కార్మికులుగా చేరుతూ నమ్మకద్రోహానికి పాల్పడుతున్న ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవగాహన నోటీసును విడుదల చేశారు. జూబ్లీహిల్స్‌లో మూడు దారుణాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొందరు నేరస్థులు, ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వ్యక్తులు గృహ కార్మికులుగా, కేర్‌టేకర్లుగా ఇళ్లలో చేరుతున్నారు.

యజమానుల నమ్మకాన్ని, సానుభూతిని సంపాదించి ఇళ్లలో ప్రవేశిస్తూ.. ఆ తర్వాత దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటివి మూడు కేసులు నమోదయ్యాయని, అందులో ఒకటి లాభం కోసం చేసిన దారుణ హత్య (మర్డర్ ఫర్ గెయిన్) కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి గుర్తింపు లేని, ధ్రువీకరించలేని వ్యక్తుల సిఫార్సులతో ఉద్యోగాల్లో చేరుతుంటారు.

అతి తక్కువ కాలంలోనే కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పూర్తిగా చూరగొంటారు. ఇంట్లోని విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి? కుటుంబ సభ్యుల దినచర్యలు ఏమిటి? భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే సమాచారాన్ని సేకరిస్తారు. యజమానులు ఇంట్లో లేని సమయాన్ని చూసి భారీ దొంగతనానికి పాల్పడి పారిపోతుంటారు.
​పోలీసులు సూచిస్తున్న ముందస్తు నివారణ చర్యలు
ఏ గృహ కార్మికుడిని చేర్చుకున్నా వారి పూర్తి వివరాలతో పోలీసు ధ్రువీకరణ (వెరిఫికేషన్) ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలి.సాధ్యమైనంతవరకు నేపాలీ గృహ కార్మికులను నియమించకుండా ఉండటం శ్రేయస్కరం. ఒకవేళ నియమించుకుంటే, వారి గుర్తింపు వివరాలను పూర్తిగా సేకరించాలి. పనిలో చేర్చుకునే ముందే వారి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం, ఫోటోలు, మొబైల్ నంబర్ శాశ్వత చిరునామాను క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలి.

గృహ కార్మికుల వివరాలను రికార్డు నిర్వహణ కోసం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి. ఇళ్లలో తప్పనిసరిగా CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే విలువైన వస్తువులు, లాకర్లు ఉండే సున్నితమైన ప్రాంతాల్లోకి పనిమనుషులకు ప్రవేశం లేకుండా పరిమితం చేయాలి.
​మీ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా, లేదా సమాచారం తెలిసినా వెంటనే మేడ్చల్ పోలీసులను క్రింది నంబర్లలో సంప్రదించాలని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు..
8712663280 / 8712663281 / 8712663289

Leave a Reply