ప్రజాస్వామ్యానికి ముప్పుగా బీజేపీ విధానాలు..
ప్రతిపక్షాల బలహీనీకరణ, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం చూపుతున్నారంటూ విమర్శలు
ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని పిలుపు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. అధికారాన్ని కేంద్రీకరించడం, ప్రతిపక్షాలను బలహీనపరచడం, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయడం వంటి చర్యలతో దేశ ప్రజాస్వామ్య మూల స్తంభాలనే ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు.
ఉరవకొండలోని దేవాంగ కళ్యాణ మండపంలో జిల్లా సమితి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న సీపీఐ రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని సోమవారం కె. రామకృష్ణ ప్రారంభించారు. తొలుత పార్టీ సీనియర్ నాయకుడు గన్నే మల్లేష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి. కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో వ్యక్తిగత స్థాయిలో పార్టీ మార్పులు జరిగేవని, ప్రస్తుతం మొత్తం పార్టీలనే తమ కూటమిలో విలీనం చేసుకునే విధానాన్ని బీజేపీ అనుసరిస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన ధోరణిగా అభివర్ణించారు.
రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి వాటిని రాజకీయంగా బలహీనపరుస్తున్నారని, ఎన్నికల ప్రక్రియను కూడా ప్రభావితం చేసే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. తమిళనాడులో 70 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 90 లక్షలు, కేరళలో 9 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఓటర్ల జాబితాల తొలగింపులు, నామినేషన్ల తిరస్కరణ వంటి అంశాలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి మంచివి కావని పేర్కొన్నారు.
లోక్సభ, రాజ్యసభల్లో మెజార్టీ కోసం భారీ స్థాయిలో రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే నీతులకు, ఆచరణలో చేపడుతున్న విధానాలకు పొంతన లేదని విమర్శించారు.
మరోవైపు మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ, అయోధ్య రామాలయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారని, దేవుడిని సైతం రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
దేశంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను, లౌకిక భావజాలాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. వాలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి, సంక్షేమ రంగాల్లో స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.
అనంతరం “మార్క్సిజం అంటే ఏమిటి” అనే అంశంపై కామ్రేడ్ గోపాల్, “రాజకీయ ఆర్థిక శాస్త్రం అంటే ఏమిటి” అనే అంశంపై ప్రొఫెసర్ కె.వి. రమణ, “శాస్త్రీయ సోషలిజం అంటే ఏమిటి, సోషలిస్ట్ ఆర్థిక విధానం మరియు నేడు సోషలిజానికి ఉన్న ప్రాధాన్యత”పై పి.ఎల్. నరసింహులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, రామకృష్ణ, పద్మావతి, పార్వతీ ప్రసాద్, నారాయణస్వామి, మల్లికార్జున, రమణయ్య, లింగమయ్య, నాగార్జున, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య, ఉరవకొండ పార్టీ కార్యదర్శి చెన్నారాయుడు, నియోజకవర్గ నాయకులు సుల్తాన్, నాగేంద్ర, బసవరాజు, సూరి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
